7, మార్చి 2009, శనివారం

మౌనంగానే....

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికిచేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటినవారికి సొంతమౌతుంది
తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది

చెమటనీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

5, మార్చి 2009, గురువారం

అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదె

గత జీవిడగు పతిన్ బ్రతికించుకొన్నట్టి
సావిత్రి భరత సతియె కాదె
తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చె
చంద్రమతి పవిత్ర సతియ కాదె
కుల సతీత్వమునకై గుండాన దూకినా
సీత భారత ధరాజాత గాదె
కినిసి దుర్మద కిరాతుని బూది గావించె
దమయంతి భారత రమణి గాదె

సప్త సాగర పరివేష్టితోర్వితలము
భరత జాతి పాతివ్రత్య ప్రవిమలంబు
భావ సంపదకిది మహా పంట భూమి
అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదె

4, మార్చి 2009, బుధవారం

ఖండ ఖండాంతర

ఖండ ఖండాంతర ఖ్యాతి నార్జించిన
మహనీయులను గన్న మాతృ భూమి
పాశ్చాత్య వీరుల పారద్రోలించుయు
స్వాతంత్రమును గన్న సమరభూమి
సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యల
ధీశక్తి చూపిన దివ్య భూమి

చిత్రకళల తోడ చిత్రమైయున్నట్టి
భరత భూమియందు జననమొంది
భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడ
భాధ్యతంత మీదె బాలులార !

2, మార్చి 2009, సోమవారం

ఏ దేశమేగినా ఏందు కాలిడినా

ఏ దేశమేగినా ఏందు కాలిడినా
ఏ ఫీఠమెక్కినా, ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

ఏ పూర్వ పుణ్యమో, ఏ యొగబలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున
ఏమంచి పూవులన్ ప్రేమించినావో
నిను మోచె యీ తల్లి కనక గర్భమున

లేదుర ఇటువంటి భూదేవి యెందు
లేరుర మనవంటి పౌరులింకేదు
సూర్యుని వెలుతురుల్ సోకునందాక
ఓడల జెండాలు ఆడునందాక
అందాకగల ఈ అనంత భూతలిని
మన భూమివంటి చల్లని తల్లి లేదు
పాడరా నీ వీర భావ భారతము

తమ తపస్సులు ఋషుల్ ధారవోయంగ
శౌర్య హారము రాజచంద్రులర్పింప
భావ సూత్రము కవిప్రభువులల్లంగ
రాగ దుగ్ధము భక్తరత్నముల్ పిదుక

దిక్కులకెగదన్ను తేజమ్ము వెలుగ
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగ
జగముల నూగించు మగతనంబెగయ
సౌందర్యమెగబోయు సాహిత్యమలర

వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర
దీపించె నీ పుణ్య దేశంబు పుత్ర
పొలముల రత్నాలు మొలిచెరా యిచట
వార్ధిలో ముత్యాలు పండెరా యిచట

పృథివి దివ్యౌష్ధుల్ పిదికెర మనకు
కానల కస్తూరి కాచెరా మనకు
అవమానమేలర? అనుమానమేల?
భారతీయుడనంచు భక్తితో పాడ