19, జూన్ 2010, శనివారం

దేశ చరిత్రలు

ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం.

నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం..
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహసిక్తం.

భీభత్సరస ప్రధానం,
పిశాచగణ సమవాకారం!
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడం

బలవంతులు దుర్బల జాతిని
బానిసలను కావించారు..
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి

రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదకిన దొరకదు..
గతమంతా తడిసె రక్తమున,
కాకుంటే కన్నీళులతో

చల్లారిన సంసారాలూ,
మరణించిన జన సందోహం,
అసహాయుల హాహాకారం
చరిత్రలో మూలుగుతున్నవి

వైషమ్యం, స్వార్ధపరత్వం,
కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్ధలు
మాయలతో, మారుపేర్లతో
చరిత్ర గతి నిరూపించినవి

జెంఘిజ్ ఖాన్, తామర్లేనూ
నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ,
సికందరో ఎవడైతేనేం?
ఒక్కొక్కడూ మహాహంతకుడు

వైకింగులు, శ్వేతహూణులూ,
సిధియన్లూ, పారశీకులూ,
పిండారులూ, ధగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన

అగ్నానపు టంధయుగంలో,
ఆకలిలో, ఆవేశంలో-
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడచి మనుష్యులు-

అంతా తమ ప్రయోజకత్వం,
తామే భువి కధినాధులమని,
స్ధాపించిన సామ్రాజ్యాలూ,
నిర్మించిన క్రుత్రిమ చట్టాల్

ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై!
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను

చిరకాలం జరిగిన మోసం,
బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ
ఇంకానా! ఇకపై చెల్లవు

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా? ఇకపై సాగదు

చీనాలో రిక్షావాలా,
చెక్ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ -

హాటెన్ టాట్, జూలూ, నీగ్రో,
ఖండాంతర నానా జాతులు
చారిత్రక యధార్ధతత్వం
చాటిస్తా రొక గొంతుకతో

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో?
తారీఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్రకర్ధం

ఈ రాణీ ప్రేమపురాణం,
ఆ ముట్టడికైన ఖర్చులూ,
మతలబులూ, కైఫీయతులూ
ఇవి కావోయ్ చరిత్రసారం

ఇతిహాసపు చీకతికోణం
అట్టడుగున పడి కాన్పించని
కధలన్నీ కావాలిప్పుడు!
దాచేస్తే దాగని సత్యం

నైలునదీ నాగరికతలో
సామాన్యుని జీవన మెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?

సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,
అది మోసిన బోయీలెవ్వరు?

తక్షశిలా, పాటలీపుత్రం,
మధ్యధరా సముద్రతీరం,
హరప్పా, మొహేంజదారో,
క్రో - మాన్యాన్ గుహముఖాల్లో -

చారిత్రక విభాత సంధ్యల
మానవకధ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దేపరమార్ధం?

ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?
ఏ వెల్గుల కీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?

కామెంట్‌లు లేవు: